ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, ఏప్రిల్ 2010, బుధవారం

తరతరాల చందమామ

భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చందమామ కథల పత్రికను చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు. దైవ ప్రయత్నం కంటే మానవ ప్రయత్నానికి, తద్వారా మనుషులు సాధించే అంతిమ విజయాలకు ప్రాధాన్యమిచ్చే చందమామ కథలు తరాలు మారినా, సాంకేతిక జ్ఞాన ఫలాలతో జీవితం మూలమలుపులు తిరుగుతున్నా భారతీయ పాఠకులను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి. సున్నిత హాస్యం, విజ్ఞానం, వినోదాల మేళవింపుగా రూపొందుతూ వచ్చిన చందమామ కథలు వాటికి తోడయిన అద్బుత చిత్రాలు -చిత్రా, శంకర్, ఎంటీవీ ఆచార్య, వడ్డాది పాపయ్య, రాజీ తదితరుల చిత్ర సృజన- భారతీయ పిల్లల మానసిక ప్రపంచాన్ని దశాబ్దాలుగా వెలిగిస్తూ వస్తున్నాయి.

ఆ పిల్లలు ఆ కథలతో పాటు పెరిగినా, జీవితంలో అన్ని దశలనూ అధిగమించినా సరే ఈనాటికీ వారు తమ బాల్యాన్ని మర్చిపోలేదు. తమ బాల్యాన్ని మంత్రనగరి సరిహద్దులలో ఊగించి, శ్వాసించిన చందమామ కథలనూ మర్చిపోలేదు. తెలుగునేల మీదే కాదు.. భారతీయ భాషలన్నింటిలోనూ అలనాటి తరం చందమామతో తమ అనుబంధం మర్చిపోలేదు. 1947 నుంచి చందమామ పత్రికను కొంటూ తమ పిల్లలకు, మనవళ్లు, మనవరాళ్లకూ కూడా చందమామ కథలు చదివి వినివిస్తూ, తాము మళ్లీ మళ్లీ చదువుతూ చందమామతో తాదాత్మ్యం చెందుతున్న పాఠకులు దేశంలో ఏ భాషలోనూ, ఏ ప్రాంతంలోనూ మరే పత్రికకూ లేరని చెప్పడం కూడా అతిశయోక్తి కాదు.

ఆరు దశాబ్దాల క్రితం పిల్లల పత్రికగా మొదలైన చందమామను ప్రస్తుతం 70, 80 ఏళ్ల పైబడిన వారు ఇప్పటికీ కొని చదువుతూ తమ మనవళ్లు, మనవరాళ్లకు వాటిని చదివి వినిపిస్తున్నారంటే ఒకనాటి చనుబాల కథల పత్రిక క్రమంగా ఆబాల గోపాల కథల పత్రికగా మారిన వైనం బోధపడుతుంది.

మారుతున్న కాలం, మారుతున్న తరాలు, పిల్లల అభిరుచులకు అనుగుణంగా దశ, దిశలు రెండింటినీ మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న చందమామను వెనక్కి పట్టి లాగి మూలం నుంచి పక్కకు పోవద్దని హెచ్చరిస్తూ, ధ్వజమెత్తుతూ, దూషిస్తూ కూడా చందమామ సారాన్ని నిలబెట్టుకోవాలని తపన పడుతున్న పాఠకుల వంటి వారు మరే భారతీయ పత్రికకూ కూడా లేరు. యాజమాన్యం చేతులు మారినా చందమామ మూల రూపం మారితే సహించబోమంటూ నిరసన తెలుపుతూ, ఉత్తరాలు, ఫోన్లు, ఈమెయిళ్లు, ఎస్ఎమ్ఎస్ ల ద్వారా అలుపెరుగని పోరాటం చేస్తున్న అరుదైన పాఠకులు చందమామకు తప్ప ప్రపంచంలో మరే పత్రికకు కూడా లేరని చెప్పవచ్చు.

చందమామ ఎందుకింత చరిత్ర సంపాదించుకుంది! లక్షలాది మంది పిల్లలు పెద్దల మనో ప్రవంచంపై ఇంత మహత్ ప్రభావాన్ని చందమామ దశాబ్దాలుగా ఎలా కలిగిస్తూ వస్తోంది? భారతీయ సాహిత్యాకాశంలో కథా కాంతులు మెరిపించిన ఈ గొప్ప చరిత్రకు, ఈ గొప్ప సంస్కృతికి ముగ్గురు మహనీయులు కారణం. వారి వల్లే, వారి దార్శనికత వల్లే చందమామ ఇంతటి ఘనతర చరిత్రను సాధించగలిగింది. వారు నాగిరెడ్డి, చక్రపాణి, కుటుంబరావు గార్లు. తొలి ఇద్దరూ చందమామకు రూపురేఖలు నిర్దేశిస్తే, తనకే సాధ్యమైన అతి సరళమైన రచనా శైలితో ఆబాల గోపాలం చందమామను తమ హృదయాలకు హత్తుకునేలా మార్చిన వారు కొడవటిగంటి కుటుంబరావు గారు. తను ఏ కథనైనా మన దేశానికీ, తెలుగు భాషకూ సరిపోయేట్టు మలిచి రాసేవారు.

అనన్య సామాన్యమైన ఈ త్రిమూర్తుల దార్శనిక కృషి ఫలితంగా, ప్రపంచ సాహిత్యంలోని గొప్ప అంశాలన్నీ "చందమామ"లో కథలుగా వచ్చాయి. భారతం, రామాయణం, భాగవతం, ఉపనిషత్తుల్లోని కొన్ని కథలూ, కథా సరిత్సాగరం, బేతాళకథలూ, పంచతంత్రం, బౌద్ధ జాతక కథలు, జైన పురాణ కథలు, అరేబియన్‌ నైట్స్‌ ఇలా విశిష్టమైనవన్నీ మామూలు కథల రూపంలో వచ్చాయి. భాసుడు, కాళిదాసు, ఇంకా ఇతర సంస్కృత రచయితల నాటకాలూ, షేక్‌స్పియర్‌ అనువాదాలు ఎన్నిటినో పాఠకులు చదవగలిగారు.

ఇవి కాక గ్రీక్‌ పురాణాలైన ఇలియడ్‌,ఒడిస్సే, వివిధ దేశాల జానపద కథలూ, పురాణ కథలూ, ప్రపంచ సాహిత్యంలోని అద్భుత కావ్యగాథలూ అన్నీ "చందమామ"లో సులభమైన భాషలో వచ్చాయి. పురాణాలే గాక ఇతర సాహిత్య రత్నాలైన కావ్యాలు శిలప్పదిగారం, మణిమేఖలై లాంటివి కూడా వచ్చాయి. "చందమామ" ఆఫీసులో అన్ని ప్రపంచదేశాల జానపద కథలూ ఉండేవి.

భారతీయ పిల్లలను జానపద ప్రపంచపు ఊహాలోకాల్లో విహరింపజేస్తూ వచ్చిన చందమామ కథలు, వారు సత్ప్రవర్తనతో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేటట్లుగా, నిజాయితీ, లోకజ్ఞానం, నైతిక ప్రవర్తన, కృతజ్ఞత, వినయం, పెద్దల పట్ల గౌరవం, ఆత్మాభిమానం, పౌరుషం, దృఢ సంకల్పం లాంటి మంచి లక్షణాలను అలవరచుకునేలా చేస్తూ వచ్చాయి. మంచి అలవాట్లు, నీతి, నిజాయితీ, స్నేహం, విశ్వాసం నేర్పుతూనే పిల్లలకు పుస్తకాలు చదవటం నేర్పుతోంది చందమామ.

చందమామ కథలు ఏ వ్యక్తిత్వ వికాసానికీ తీసిపోని విజ్ఞాన గనులని చందమామ అభిమానులు ముక్తకంఠంతో చెబుతున్నారు. "విలువలు నేర్పుతూ, ఊహాశక్తిని పెంపొందిస్తూ, సమస్యల చిక్కుముడులు ఎలా విప్పదీయాలో చూపిస్తూ, కొత్త విషయాలు నేర్పుతూ, చరిత్రని గురించిన సంగతులు, పురాణాలు, ఇతిహాసాలు.. ఒహటేమిటి, అదీ-ఇదీ అని కాదు, లేనిది లేనే లేదు.. నీతి కధల్లోనే ఎన్నో రకాలు.. గుణపాఠాలు నేర్చుకునే కధలు, మార్పు(పశ్చాత్తాపం) గురించిన కధలు, మంచిగా ఉండేవాళ్ల కధలు – ఇలా ఎన్నో.. చిన్నప్పటి నుండి ఇలాంటివి చదవడం వల్ల, మనకి తెలియకుండానే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాం.. ఎప్పుడైనా తప్పు చేయాల్సి వచ్చినా భయమేస్తుంది, ఆ కధలోలా నాకు కూడా ఏమైనా జరుగుతుందేమో అని.. అలా పిల్లల వ్యక్తిత్వాలని తీర్చిదిద్దే పత్రిక చందమామ అంటే అతిశయోక్తి కాదేమో..

ఇంతటి ఘనతర చరిత్ర సాధించుకున్న చందమామ పత్రికకు మా దొడ్డ పాలసీ ఉండేది. పత్రికకు తప్ప పనిచేసే సిబ్బందికి ప్రచారం కల్పించరాదనే ఈ దొడ్డ లేదా చెడ్డ పాలసీ వల్ల 6 దశాబ్దాలపాటు చందమామలో పనిచేసిన మేటి సంపాదకులు, చందమామ కథలకు చిత్రకాంతులద్దిన చిత్రకారులు, రచయితలు, తదితర సిబ్బంది చరిత్ర, వారి జీవిత వివరాలు ప్రపంచానికి అందకుండా పోయాయి. చివరకు చందమామలో 3 దశాబ్దాలు పనిచేసి చందమామ చరిత్రలో స్వర్ణయుగానికి కారకులైన కొడవటిగంటి కుటుంబరావు గారు చందమామ అనధికారిక సంపాదకుడిగా పనిచేశారనే విషయం కూడా బయటి ప్రపంచానికి తెలియకుండా పోయింది.

ఇలాంటి ఎన్నో అరుదైన విషయాలను, చందమామ చరిత్రను, చందమామతో పాఠకుల, రచయితల జ్ఞాపకాలను అందరితో పంచుకోవాలని ఈ బ్లాగును రూపొందించడమైనది. చందమామలో పనిచేసే ఉద్యోగిగా చందమామ ఇన్‌సైడ్ చరిత్రను నిష్పాక్షికంగా వెలికి తీసి ప్రపంచంతో పంచుకోవాలని రూపొందించిన ఈ బ్లాగును బ్లాగర్లు ఆదరిస్తారని, మీకు తెలిసిన చందమామ జ్ఞాపకాలను, చరిత్రను వీలు కుదిరినప్పుడల్లా పంచుకుంటారని ఆశిస్తున్నాను.

ఈ బ్లాగులో చందమామ చరిత్ర, జ్ఞాపకాలే కాకుండా అలనాటి ఆణిముత్యాలను -పుస్తకాలు, సినిమాలు, పాటలు- వంటివాటిని కూడా సమయ సందర్భానుసారం పొందుపర్చడం జరుగుతుంది. సామాజిక, సాంస్కృతిక మార్పులపై వ్యాఖ్యలతో వివిధ విభాగాల సమాహారంగా కొనసాగే ఈ చందమామ చరిత్ర బ్లాగులో మీరూ భాగమవుతారని, మీ అభిప్రాయాలను పంచుకుంటారని ఆశిస్తూ..

చందమామ అభిమాని